తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యపడటం లేదు. విమర్శలు, ప్రతి విమర్శలతో నాయకులు ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకుంటున్నారు. తాజాగా ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ఒకరిపై ఒకరు నువ్వానేనా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇలాంటి విభేధాలే మరోసారి బయటపడ్డాయి. ఇందుకు అమీర్ పేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం వేదికైంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రోటోకాల్ రగడ రాజుకుంది. దీంతో ఉద్రిక్తతలు తలెత్తాయి.
ఆసుపత్రి ప్రారంభోత్సవ ప్లెక్సీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోటో లేకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆవేశానికి గురయ్యారు. తమ నాయకుడి ఫోటో ఎందుకు పెట్టలేదంటూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ నెలకొంది. ప్రారంభోత్సవానికి హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రసంగించకుండానే వెళ్లిపోయారు.