సాగర్ ఉప ఎన్నిక పై టీఆర్ఎస్ ద్విముఖ వ్యూహం

-

టీఆర్ఎస్ పార్టీలో నడుస్తున్న గందరగోళం సీఎం మార్పు పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇక ఇప్పుడుసాగర్ ఉపఎన్నిక కోసం ద్విముఖ ప్యూహం అమలు చేయబోతుందట గులాబీ దళం. దుబ్బాకలో జరిగిన పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకొని.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒక పక్క అందరికి ఆమోదయోగ్యమైన పార్టీ అభ్యర్ది తో పాటు అభివృద్ది పనుల పై ఫోకస్ పెట్టింది..

నాగార్జునసాగర్ ఉపఎన్నికపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది టీఆర్‌ఎస్‌. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఉపఎన్నికపై చర్చించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు బాధ్యతలు తీసుకుని ఉపఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. అందరికి అమోదయోగ్యమైన అభ్యర్ధిని ఎంపిక చేస్తామని..ఈ మీటింగ్‌లోనే కేసీఆర్ అన్నారట. అయితే ఆ అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. బరిలో నిలిచే నేత ఎవరు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది…

హలీయాలో జరిగే సభతో సీఎం కేసీఆర్‌ ఉపఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇటు నాగార్జున సాగర్ నియెజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై అంతర్గగతంగా నివేదికలు తెప్పించుకుంది టిఆర్ఎస్. అక్కడ ఎన్నికల షెడ్యూలు వచ్చే లోపే చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది.దుబ్బాక ఉపఎన్నికల్లో బలమైన అభ్యర్ధి లేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని టిఆర్ఎస్ అంతర్గత విశ్లేషణలో తేలింది. దుబ్బాక ఫలితంతో నేర్చుకున్న గుణపాఠాలతో.. అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటోంది గులాబీ పార్టీ.

ప్రస్తుతం దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ టిక్కెట్ అశిస్తున్నారు. నాగార్జునసాగర్ లో యాదవ సామాజిక వర్గం, బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో.. అప్పట్లో నోముల నర్సింహయ్యను బరిలోకి దింపింది టిఆర్ఎస్. ఇప్పుడు యాదవ సామాజిక వర్గంకు చెందిన గురువయ్య యాదవ్ నాగార్జున సాగర్ టిక్కెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నట్టు గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మంత్రి జగదీష్ రెడ్డికి సన్నిహితుడు అయిన కోటిరెడ్డి కూడా రేసులో ఉన్నారు. మరి వీరేవరూ కాకుండా కొత్తగా ఎవరైనా తెరపైకి వస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది.

ఉపఎన్నికలో గెలవాలంటే అభ్యర్థి ఎంపికే కీలకం. ఈ సమయంలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నేతను ఎన్నుకుంటే.. నేతలంతా కలిసికట్టుగా గెలుపు కోసం కృషి చేస్తారు. అలాగే నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యల పై కూడా దృష్టిపెట్టింది టీఆర్ఎస్. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు సరైన అభ్యర్థి ఎంపికకు ప్రయత్నిస్తోంది. ఇంతకీ, ఆ అభ్యర్థి ఎవరన్నదానిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version