రంగారెడ్డి జిల్లాపరిషత్ రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే జెడ్పీ చైర్మన్ పై తిరుగుబాటు జెండా ఎగరెయ్యడంతో టీఆర్ఎస్ లో అలజడి మొదలైంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు జడ్పీ ఛైర్‌పర్సన్‌కు, జడ్పీటీసీలకు సఖ్యత లేదన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట.ఇప్పుడిదే వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది..ఏకంగా సమావేశాన్ని అధికార పార్టీ సభ్యులే బహిష్కరించే వరకు వెళ్లింది. అయితే ఈ వివాదం వెనుక పలు ఆసక్తికర విషయాలు ఆర్ధిక లావాదేవిలు ఉన్నట్లు తెలుస్తుంది.
రంగారెడ్డి జిల్లా పరిషత్ కొలువై రెండేళ్లు అయింది. తీగల అనిత హరినాథ్‌రెడ్డి జడ్పీ చైర్‌పర్సన్. ఈ జిల్లాలోని జడ్పీటీసీల్లో 80శాతం మంది అధికారపార్టీకి చెందిన వారే. మిగతా వారిలో కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్రులు ఉన్నారు. విపక్ష సభ్యులతో ఎలాగూ చైర్మన్ కి పడదు.. చివరకు అధికారపక్ష సభ్యులతోనూ గ్యాప్ ఉందట. రెండేళ్లుగా ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం సాధ్యం కావడం లేదని సమాచారం. అభివృద్ధి పనులపై ఈ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
టీఆర్‌ఎస్ జడ్పీటీసీలు తమ మండలాలకు కావాల్సిన పనులను అధికారులతో స్వయంగా మాట్లాడి.. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో చెప్పి చేయించుకుంటున్నారట. వారికి పెద్దగా నిధుల కొరత లేదని సమాచారం. విపక్ష సభ్యులు ఉన్న ప్రాంతాల్లోనే అభివృద్ధి పనులు పడకేశాయి. ఎప్పుడు జడ్పీ మీటింగ్ జరిగినా ఈ అంశంపైనే అధికారులను నిలదీస్తున్నారు విపక్ష సభ్యులు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ప్రభావం కొన్ని మండలాలపై కనిపిస్తోందట. జడ్పీ సమావేశాల్లో అధికారపార్టీ సభ్యుల ఆగ్రహావేశాలకు కూడా లెక్కలు ఉన్నాయట.
ఇటీవల జడ్పీ సమావేశం నిర్వహణ గగనంగా మారింది. మొదటిరోజు కోరం లేదని సమావేశాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. వాస్తవానికి ఆ రోజు సభ్యులంతా జడ్పీ కార్యాలయానికి వచ్చినా.. సమావేశ మందిరంలోకి రాకుండా నిరసన తెలిపారు. సభ్యులకోసం గంటపాటు ఎదురు చూసిన తర్వాతే వాయిదా వేశారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు జడ్పీ ఛైర్‌పర్సన్ ఛాంబర్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కల్పించుకుని.. జడ్పీటీసీలు, ఎంపీపీలకు సర్ది చెప్పడంతో వాతావరణం కొంత సానుకూలించిందట.
జడ్పీ ఛైర్‌పర్సన్ అనితకు.. జడ్పీటీసీలకు మధ్య గ్యాప్ రావడానికి వేరే కారణాలున్నాయనిరాజకీయవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టే సమయంలో సభ్యులకు బహుమతులు ఇస్తానని చెప్పారట అనిత. అయితే.. రెండేళ్లయినా ఆ గిఫ్ట్‌లు అందలేదని సభ్యులు కినుక వహించారట. అలాగే నిధుల కేటాయింపులోనూ కమీషన్లు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశాలపై తాడో పేడో తేల్చుకోవడానికి జడ్పీటీసీలు నిర్ణయించారట. ఈ కమీషన్ల గోల రంగారెడ్డి జడ్పీ రాజకీయాన్ని వేడెక్కిస్తోంది.