హుజురాబాద్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నది. ఉప ఎన్నిక బరిలో తమ పార్టీ తరఫున నిలబడే హుజురాబాద్ అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు అభ్యర్థుల పేర్లను పరిశీలించిన టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తాజాగా అభ్యర్థి ఎవరనేది తేల్చిందని సమాచారం. ఆయన ఎవరంటే..
‘దళిత బంధు’ స్కీమ్ తమ పార్టీని హుజురాబాద్‌లో గెలిపించేందుకు ఉపయోగపడుతున్నదని భావిస్తున్నది టీఆర్ఎస్ పార్టీ. ఈ పథకం ప్రారంభ ముహుర్తం ఈ నెల 16న ఖరారు కాగా, అదే రోజున సీఎం కేసీఆర్ హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇక అభ్యర్థి ఎవరనే విషయమై కొద్ది రోజుల నుంచి రాజకీయ వర్గాలతో పాటు గులాబీ పార్టీ శ్రేణులు, నేతలు చర్చించుకుంటుండగా ఫైనల్ డెసిషన్ సీఎం తీసుకున్నారట.
ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు సంకేతాలు కూడా పంపారని వినికిడి. హుజురాబాద్‌లోని వీణవంక మండలానికి చెందిన నేత టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. అభ్యర్థిగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పింక్ పార్టీ ప్రచారం జోరుగా ఉండబోతుందట. ఇక ఇప్పటికే బీజేపీ తరఫున బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు, కాగా, కౌంటర్ అటాక్‌గా టీఆర్ఎస్ పార్టీ బీసీ అభ్యర్థినే బరిలోకి దించబోతున్నది. ఈ ఉప ఎన్నిక ద్వారా ఈటల రాజకీయ భవిష్యత్తుతో పాటు అధికార పార్టీ సంక్షేమం, అభివృద్ధి సంగతి బయటపడనుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలోని ఇతర పార్టీల నేతలు కొందరిని గులాబీ పార్టీ తన గూటికి ఇటీవల తీసుకున్నది. తద్వారా టీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.