సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక జరుగుతోన్న వేళ ఇక్కడ రాజకీయం మారుతోంది. గతంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మృతి చెందిన ఖేడ్, పాలేరులో టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేసి గెలిచారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ కూడా దుబ్బాకలో అభ్యర్థిని నిలబెడుతోంది. ఇక బీజేపీతో పాటు కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా రంగంలో ఉండడంతో దుబ్బాక రాజకీయం వేడుక్కుతోంది. ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే గెలవొచ్చు… అయితే ఈ సారి ప్రతిపక్షాలు మాత్రం గట్టి పోటీ ఇవ్వనున్నాయన్నది క్లీయర్‌గా తెలుస్తోంది. రెండోసారి గెలిచాక టీఆర్ఎస్‌పై తెలంగాణలో వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. ఇది లోక్‌సభ ఎన్నికల్లోనే తేలిపోయింది.
ఇక హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో భారీగా డబ్బులు వెదజల్లిన టీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. ఈ సారి దుబ్బాకలో మాత్రం వార్ మరీ అంత వన్‌సైడ్‌గా ఉండే పరిస్థితి లేదు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడ మరణించిన మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్యకు ఇవ్వవచ్చని అంటున్నా ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి 2014 నుంచే దుబ్బాక సీటుపై కన్నేసి ఉన్నారు. కేసీఆర్ ఖచ్చితంగా రామలింగారెడ్డి కుటుంబానికే సీటు ఇస్తారన్న గ్యారెంటీ అయితే లేదని పార్టీ వర్గాలే చెపుతున్నాయి.
ఇక మాజీ మంత్రి ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి సైతం ఈ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డికి టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్‌లోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి అయినా పోటీ చేస్తారన్న టాక్ కూడా ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి విజయశాంతి పేరు కూడా వినిపిస్తోంది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూడా పేరు కూడా తెరమీదకు వస్తోంది. ఇక బీజేపీ తరపున ఆ పార్టీ కీలక నేత రఘునందన్ రావు పేరు దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా చేపట్టారు. యువకులే టార్గెట్‌గా ఆయన రాజకీయం నడుస్తోంది. ఇక రఘునందన్ రావు ఇక్కడ నుంచి 2014, 2018 ఎన్నికలతో పాటు 2019 మెదక్ ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు.
ఇక ఇండిపెండెంట్ల విషయానికి వస్తే బిగ్‌బాస్ ఫేం కత్తి కార్తీక ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఇక మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ప్రచారం ప్రారంభించేశారు. ఏదేమైనా ఈ సారి ప్రతిపక్షాలు ఇక్కడ కారు జోరుకు గట్టి బ్రేకులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకుండానే రాజకీయం ఓ రేంజ్‌లో వేడెక్కించింది.
-Vuyyuru Subhash