మునుగోడు ఉపఎన్నికల్లో పోటీకి నిలబెట్టే అభ్యర్ధిపై టీఆర్ఎస్ పార్టీలో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ఈ సారి ఉపఎన్నికలో ఓడిపోతే మాత్రం టీఆర్ఎస్ పార్టీకి సాధారణ ఎన్నికల్లో గెలుపు కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఈ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ చూస్తుంది. ఇప్పటికే అభ్యర్ధిని డిక్లేర్ చేసే విషయంలో చాలా లెక్కలు వేస్తుంది. ఇప్పటికే బీజేపీ తరుపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగడం ఖాయం. ఇక కాంగ్రెస్ తరుపున ఆర్ధికంగా బలంగా ఉన్న చల్లమల్ల కృష్ణారెడ్డి పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతుంది.
ఇక టీఆర్ఎస్ తరుపున కూడా రెడ్డి వర్గం నేతనే బరిలో దింపే అవకాశం ఉందని తెలుస్తోంది. నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువ…అయినా సరే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెడ్డి వర్గం నేతల వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడ కులాల కంటే ఆర్ధికంగా బలమైన అభ్యర్ధులనే ఎంపిక చేస్తున్నారు. ఇదే క్రమంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డే మరోసారి బరిలోకి దిగనున్నట్లు తెలిసింది.
2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రభాకర్‌రెడ్డికే టికెట్ ఇవ్వనున్నట్లు, ఆ పార్టీ అంతర్గత చర్చల్లో తేలిందట. అయితే ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేతలు పెద్దసంఖ్యలో వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ అధిష్ఠానానికి ముందుగానే లేఖ రాశారు. కానీ టీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఆర్ధికంగా బలమైన నేత. ఎంత కాదన్నా, ఎవరు వద్దన్నా అభ్యర్థుల ఎంపికలో చివరకు ఆర్థికబలం కూడా అదనపు అర్హతగా చేరిపోతుంది. కానీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఆర్థిక అంశం పెద్ద విషయం కాకపోయినా, అధికారంలో ఉన్న పార్టీగా నిధులకు కొరత ఉండే అవకాశం ఏమాత్రం లేకపోయినా.. ఉన్నవారిలో ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థినే ఎంపిక చేస్తే ఇంకా అడ్వాంటేజ్ అవుతుందని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుందట.
అయితే కూసుకుంట్లపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది..అలాంటప్పుడు కావాలని టికెట్ ఇస్తే..ఆయన్ని సొంత పార్టీ వాళ్లే ఓడించడానికి ప్రయత్నించే ఛాన్స్ కూడా ఉంది. ఏదేమైనా కూసుకుంట్ల వల్ల మునుగోడులో కారు పార్టీకి బెనిఫిట్ అయ్యేలా లేదు.