ఈనెల 28 నుంచి నుంచి తెలంగాణలో జరగాల్సిన ఎంసెట్ (ఇంజినీరింగ్) రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. అక్టోబరు 11 నుంచి రెండో విడత ప్రవేశాల ప్రక్రియ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్ ప్రకటించారు. ఇంజినీరింగ్ ఫీజులు, సీట్ల పెంపు అనుమతిపై స్పష్టత రాకపోవడంతో పాటు దసరా సెలవుల్లో కౌన్సెలింగ్ నిర్వహించవద్దన్న అభ్యర్థనల మేరకు షెడ్యూల్ సవరించారు.
అక్టోబరు 11, 12న ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అక్టోబరు 12న ధ్రువపత్రాల పరిశీలన, 12, 13న వెబ్ ఆప్షన్లు స్వీకరించి 16న రెండో విడత సీట్లు కేటాయిస్తారు. అక్టోబరు 16 నుంచి 18 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని నవీన్ మిత్తల్ తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాతో విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.