తెలంగాణలో 10 వ తరగతి పరీక్షలు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంటర్ పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు. నిన్న సీబీఎస్ఈ పరీక్షల పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణలో అమలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈమేరకు ఈ రోజే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఉదయం ఇంటర్, పాఠశాల విద్యాశాఖ అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణపై సమీక్ష జరిగింది. ఈ సమావేశం మీద సీఎం కి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రిపోర్ట్ ఇవ్వనున్నారు. దీనిని బట్టి ఒకటి రెండు రోజుల్లో పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని అంటున్నారు. అయితే ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతాయి అని నిన్న మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సీఎం జగన్ తో సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై చర్చిస్తామని, ఇప్పటికైతే యధావిధిగా షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు జరిపే ఆలోచనలో ఉన్నామని అన్నారు.