తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించేశారు. ఆర్టీసీని మూడు ముక్కలు చేస్తామని చెప్పారు. సగం ఆర్టీసీ బస్సులు. 30 శాతం అద్దె బస్సులు.. మరో 20 శాతం ప్రైవేటు బస్సులు ఉంటాయని చెబుతున్నారు. అయితే కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను సమ్మె పురిగొల్పి..ఆ సాకుతో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ విమర్శల్లో తెలుగు రాష్ట్రాల్లోని బడా కంపెనీ మేఘా పేరు వినిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం ఈ కంపెనీ వైపు వేలెత్తి చూపిస్తోంది. కేసీఆర్ ప్రైవేటీకరణ మంత్రం వెనుక ప్రభుత్వానికి మేఘా ప్రణాళిక ఉందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎలక్ట్రిక్ బస్ ల ద్వారా ప్రైవేట్ పరం చేసే కుట్ర ఉందన్నారు. ఎలక్ట్రిక్ బస్ లు గోల్డ్ స్టోన్ కంపెనీ కొనుగోలు చేస్తోందని ఆయన తెలిపారు.
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే… వారి వద్దకు తెలంగాణ ద్రోహి పువ్వాడ అజయ్ తో మాట్లాడించి వారు సమ్మెకు వెళ్లేలా ప్రభుత్వమే పురిగొల్పిందన్నారు రేవంత్ రెడ్డి. గోల్డ్ స్టోన్ కంపెనీ కొనుగోలు చేసే బ్యాటరీ బస్ లను ఆర్టీసీలోకి తెచ్చి ప్రైవేటీకరణ చేయబోతున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ కి చెందిన 50 వేల కోట్ల విలువైన భూములను లీజుల పేరిట కేసీఆర్ బంధువులు తీసుకున్నారని చెబుతున్నారు.
అంతే కాదు.. రెండు రోజులు రాని కార్మికుల ఉద్యోగాలు తొలగిస్తాం అంటున్నారు… మరి ఆరు ఏళ్ళు సచివాలయానికి రాని కేసీఆర్ పై పీడీ ఆక్ట్ పెట్టి అండమాన్ జైల్ లో పెట్టాలా.. అని నిలదీశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కేసీఆర్ జాగీర్ కాదు… కార్మికులు మీకు బానిసలుగా కనిపిస్తున్నారా.. 50 వేల మంది కార్మికులను రోడ్డున వేస్తామంటే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
తాము గద్దెనెక్కడానికి కేసీఆర్ కుటుంబం ఆర్టీసీ కార్మికులను ఉపయోగించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. చట్ట ప్రకారం సమ్మె చేయడం కార్మికుల హక్కు. కార్మికులను కుక్కలతో పోల్చి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారన్నారు.. డీజిల్ కు 27 శాతం వాట్ పన్ను ఆర్టీసీ కడుతోంది. డీజిల్ పన్నులే ఏటా 700 కోట్లు ఆర్టీసీ చెల్లిస్తోందని తెలిపారు. ధనికులు ప్రయాణించే విమానానికి ఉపయోగించే ఇంధన పన్నులను 16% నుంచి ఒక శాతానికి తగ్గించారు. ప్రజా రవాణా చేసే ఆర్టీసీ డీజిల్ పన్నులు తగ్గిస్తే రూ. 700 కోట్ల భారం తగ్గుతుందని సలహా ఇచ్చారు రేవంత్ రెడ్డి .