ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశారు. పోలీసులు తమ అధీనంలో ఉంచుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి ట్యాంక్ బండ్ పై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అయితే ఛలో ట్యాంక్‌బండ్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్దామరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఆటంకాలు కల్పించినా, పెద్దఎత్తున తరలివచ్చి.. కార్మికుల ఐక్యతను చాటాలని అశ్వద్ధామరెడ్డి పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా.. ఆర్టీసీ చలో ట్యాంకుబండ్ ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడి నేతలను అక్కడే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, మాజీ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి గీతారెడ్డిలను హైద్రాబాద్‌లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను హన్మకొండలో గృహ నిర్బంధం చేశారు.