తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీకి మధ్య ఇవాళ చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చల సరళి పట్ల ఆర్టీసీ జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశం మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపామని ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీ సునీల్ శర్మ చెప్పారు. హైకోర్టు చెప్పినట్టే 21 అంశాలపై చర్చలు జరిపామని, అయితే తమ వారితో మాట్లాడి వస్తామని వెళ్లిన కార్మిక సంఘాల నేతలు మళ్లీ రాలేదని అన్నారు.
‘26 డిమాండ్లపై చర్చించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు అన్నారు. విలీనంపై కూడా చర్చ జరపాలని పట్టుబట్టారు. విలీనంపై చర్చ సాధ్యంకాదు అన్నాం. దాంతో సభ్యులతో చర్చించుకుని వస్తామన్నారు. ఇప్పటివరకు రాలేదు’అని చెప్పారు. అయితే వారు మళ్లీ తిరిగి వచ్చినా చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. ఇక, చర్చల మధ్యలో అంతరాయం కలిగిస్తాయన్న ఉద్దేశంతోనే జేఏసీ నేతల మొబైల్ ఫోన్లు అనుమతించలేదని సునీల్ శర్మ వివరణ ఇచ్చారు.