తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతించడం లేదని వస్తున్న వార్తలపై టీటీడీ స్పందించింది. ఈ విషయంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గతంలో ఏవిధానం అమలు జరిగేదో ఇప్పుడు కూడా అలాగే అమలు జరుగుతోందని.. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదని ఈ సందర్భంగా టీటీడీ స్పష్టం చేసింది.
గత వారం కొందరు ప్రజా ప్రతినిధులు వారి కోటాకు మించి లేఖలు ఇచ్చారని.. విఐపి బ్రేక్ దర్శనం సమయం తక్కువగా ఉండటం, ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు రావడంతో కోటాకు మించి వచ్చిన లేఖలను తిరస్కరించడం జరిగిందని టీటీడీ వివరణ ఇచ్చింది. అయినప్పటికీ కొందరు ఫోన్ చేసి తమకు ముఖ్యమైన వారని చెప్పడంతో వారికి 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మంజూరు చేసి స్వామివారి దర్శనం చేయించడం జరిగిందని తెలిపింది. అలాగే గదులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పించడం జరుగుతోందని టీటీడీ పేర్కొంది.