కరోనా వ్యాప్తి నేపథ్యంలో సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ఓ కొత్త పథకం వేసింది. ప్రజలంతా ఫేస్ మాస్కులు ధరిస్తే ట్విట్టర్లో ‘ఎడిట్’ బటన్ చేరుస్తామని ట్విట్టర్ సంస్థ ప్రకటించింది. అందరూ అంటే ప్రతి ఒక్కరూ అని గుర్తుంచుకోవాలి అని తెలిపింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. చాలా మంది దీనిపై ఫన్నీగా రీట్వీట్లు చేస్తున్నారు. గతంలో ఈ అంశంపై ట్విట్టర్ సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సే మాట్లాడుతూ..
ఎడిట్ బటన్ ను కొందరు తప్పుగా వాడుకొనే అవకాశం ఉందని, ఈ కారణంగా ట్విట్టర్లో ఈ సదుపాయం తమకు ఇష్టంలేదని చెప్పారు. కాగా, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాంలో ఏదైనా పోస్టు తప్పుగా చేశామని అనిపిస్తే.. దానిని వెంటనే ఎడిట్ చేసుకోగలుగుతాం. కానీ, ట్వీటర్ లో అలాంటి పొరపాటు జరిగితే.. ఆపోస్టు మొత్తం డిలీట్ చేసి.. మరోసారి పోస్టు చేయాలి. దీంతో చాలా మంది ట్విట్టర్ యూజర్లు ఎడిట్ ఆప్షన్ కావాలని గత కొంత కాలం నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.