అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటానికి 200 రోజులు పూర్తి అయిన సందర్భంగా పలువురు నేతలు, ప్రముఖులు వారికి మద్దతు తెలుపుతున్నారు. వారి పోరాట పటిమను అభినందిస్తున్నారు. తాజాగా రైతులు చేస్తున్న పొరటంపై మాజీ ఎంపీ సబ్బం హరి స్పందించారు.. అమరావతి ఉద్యమాన్ని ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని.. సీఎం జగన్ కి ప్రజల గోడు వినిపించట్లేదాని ఆయన మండిపడ్డారు. అలాగే విశాఖపట్నంలో రాజధాని వద్దు అని చెప్పే మొదటి వ్యక్తిని తానే అవుతానని చెప్పారు.
అదేవిధంగా రాష్ట్రంలో మరో ఏడాది కాలంలో ముఖ్యమంత్రి స్ధానంలో జగన్ మోహన్ రెడ్డి కాకుండా వేరే వ్యక్తి ఉండే అవకాశం ఉంటుంది అనే సమాచారం ఉందని సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అదే జరిగితే అమరావతి రాజధానిగా ఉంటుందని ఆయన వివరించారు. 60 ఏళ్లపాటు హైదరాబాద్ లో ఇటుక ఇటుక కట్టి అభివృద్ధి చేస్తే కట్టుబట్టలతో బయటకు పంపారన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మన ఆశలకు రూపకల్పన చేసింది కానీ ప్రభుత్వం మారడం వలన ప్రజలు రోడ్లుపైకి రావడం జరిగిందన్నారు.