రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఈ యుద్ధాన్ని ఆపాలని యూఎన్ఓతో పాటు అన్ని దేశాలు కోరుకుంటున్నాయి. ఇటు ఈ రెండు దేశాల మధ్య నిన్న శాంతి చర్చలు జరిగాయి. బెలారస్ వేదికగా ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు భేటీ అయ్యారు. అయితే ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఇరు దేశాలు తమతమ డిమాండ్లపై గట్టిగా పట్టుబట్టడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. తమ దేశం నుంచి రష్యా బలగాలు వైదొలగడంతో పాటు, క్రిమియా నుంచి పూర్తిస్థాయిలో రష్యా వైదొలగాలని ఉక్రెయిన్ షరతు విధించింది, మరోవైపు ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకూడదని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని రష్యా కోరుతోంది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరు దేశాల ప్రతినిధుల దాదాపు 4 గంటల పాటు సమావేశం అయినా.. ఎలాంటి ఫలితం రాలేదు.
ఇదిలా ఉంటే రష్యా- ఉక్రెయిన్ మధ్య రెండో ధపా చర్చలు జరుగనున్నాయి. పోలీష్- బెలారస్ సరిహద్దుల్లో రెండో దఫా చర్చలు జరగనున్నాయి. అయితే ఏ రోజు జరుగుతాయో ఇంకా తేదీ ఖరారు కాలేదు. మరోవైపు ఓ వైపు చర్చలు జరుగుతున్నా.. ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. రష్యా దళాలు ఉక్రెయిన్ లోకి చొచ్చుకువెళ్తున్నాయి. కీవ్ నగరాన్ని ఆక్రమించుకునేందుకు రష్యన్ ఆర్మీ దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ బలగాలు రష్యా దాడిని ప్రతిగటిస్తున్నాయి.