న్యూజిలాండ్‌ అడగకపోయినా అంపైర్లు డీఆర్‌ఎస్‌ ఇచ్చారు.. కోహ్లి ఆగ్రహం.. ఫ్యాన్స్‌ ఫైర్‌..

-

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇంగ్లండ్‌లో ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతున్న విషయం విదితమే. తొలి రోజు ఆట వర్షం కారణంగా రద్దు కాగా రెండో రోజు వెలుతురు లేని కారణంగా ఆటను ముందుగానే ముగించాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 64.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 146 పరుగుల వద్ద కొనసాగుతోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అజింక్యా రహానేలు క్రీజులో ఉన్నారు. అయితే మ్యాచ్‌లో అంపైర్ల తప్పిదం వివాదానికి కారణమైంది.

భారత ఇన్నింగ్స్‌ 40 ఓవర్‌ చివరి బంతిని కివీస్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ వేయగా కోహ్లి బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకున్నట్లు అనిపించింది. బంతి నేరుగా కీపర్‌ బీజే వాట్లింగ్‌ చేతుల్లోకి వెళ్లింది. అయితే అంపైర్‌ స్పందించలేదు. దీంతో బౌల్ట్‌ రివ్యూ కోరాల్సిందిగా తమ కెప్టెన్‌ విలియమ్సన్‌ను కోరాడు. కానీ విలియమ్సన్‌ కూడా స్పందించలేదు. అప్పటికే డీఆర్‌ఎస్‌ రివ్యూ గడువు సమయం 15 సెకన్లు ముగిసింది. కానీ అనూహ్యంగా ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లు డీఆర్‌ఎస్‌కు వెళ్లారు. విలియమ్సన్‌ కోరకపోయినా, రివ్యూ సమయం ముగిసినా అంపైర్లు రివ్యూకు ఇవ్వడం వివాదాస్పదం అయింది.

ఈ క్రమంలో కోహ్లి అంపైర్లతో ఇదే విషయంపై చర్చించాడు. అయితే ఆన్ ఫీల్డ్‌ అంపైర్లు బంతి కింద పడిందా, క్యాచ్‌ సరిగ్గా పట్టాడా ? అనే విషయాన్నే చెక్‌ చేశారు. కానీ బంతికి అసలు బ్యాట్‌కు తగిలిందా ? అనేది అల్ట్రా ఎడ్జ్‌లో చెక్‌ చేయలేదు. ఇది ఇంకో వివాదానికి దారి తీసింది. కానీ థర్డ్‌ అంపైర్‌ మాత్రం సరిగ్గా స్పందించడంతో బంతి బ్యాట్‌కు తాకలేదని అల్ట్రా ఎడ్జ్‌లో తేలింది. దీంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. లేదంటే అంపైర్ల తప్పిదం కారణంగా కోహ్లి అవుట్‌ కావాల్సి వచ్చేది. కాగా ఈ విషయంపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు అంపైర్లపై జోకులు పేలుస్తున్నారు. అంపైర్లు మైకేల్‌ గాఫ్‌, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌లు ఆ సమయంలో ఆన్‌ఫీల్డ్‌లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version