తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వలస వెళ్లే వాళ్లు చాలా ఎక్కువగా ఉంటారు.. జగిత్యాల, కరీనంగర్ నుంచి గల్ఫ్ వెళ్తుంటారు.. అలా వెళ్లిన వాళ్లు అష్టకష్టాలు పడుతుంటారు. కుటుంబాలకు దూరంగా జీవిస్తుంటారు. అలా వెళ్లిన ఓ మహిళ అక్కడ వెట్టి చాకిరి చేయలేక.. తిరిగి స్వదేశానికి రావడానికి డబ్బులు లేక.. భర్తకు వీడియో కాల్ చేసి మరీ ఆత్మహత్య చేసుకుంది.. ఈ హృదయవిదారకరమైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో జరిగింది..
బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లిన వెంకట లక్ష్మి అనే మహిళ అక్కడ ఓ షేక్ ఇంట్లో వెట్టిచాకిరి చేస్తూ అర్థాంతరంగా తనువు చాలించింది. కోనసీమ జిల్లా శివకోటి వెంకట లక్ష్మి స్వస్థలం.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి బతుకుదెరువు కోసం వెదుక్కుంటున్న వెంకట లక్ష్మిని మస్కట్ ఏజెంట్స్ మోసం చేశారు. బాగా డబ్బులు సంపాదించే ఉపాధి మార్గం చూపిస్తామని నమ్మబలికిన ఏజెంట్స్ ఆమెను మస్కట్‌కి పంపించారు. ఏజెంట్స్‌కి డబ్బులు చెల్లించి మరీ వెంకట లక్ష్మి మస్కట్ వెళ్లింది. కానీ అక్కడకు వెళ్లాకే తెలిసింది.. ఆమె మోసపోయానని..
విశ్రాంతి లేకుండా ఒకటే పని.. సరైన తిండి, సౌకర్యాలు లేకుండా వెట్టిచాకిరి చేస్తూనే తీవ్ర అనారోగ్యానికి గురైన వెంకట లక్ష్మికి మస్కట్‌లో బతుకు భారమైంది. అక్కడి నుంచి బయటపడేంత డబ్బులు కూడా తన దగ్గర లేవు..ఏం చేయాలో, ఎలా బయటపడాలో ఆమెకు అర్థంకాలేదు. తాను పడుతున్న కష్టాల గురించి శివకోటిలో ఉన్న భర్తకు ఫోన్ చేసి చెప్పింది.. భార్య చెప్పినదంతా విని షాకైన భర్త.. తన భార్యకు మాయ మాటలు చెప్పి ఆమెను మస్కట్‌కి పంపించిన బ్రోకర్లను పట్టుకుని నిలదీశాడు. కానీ వాళ్లు..తమకేమీ తెలియదన్నారు.. ఈసారి ఆమెను తిరిగి భారత్‌కి తీసుకురావాలంటే లక్షన్నర వరకు ఖర్చవుతుందని.. ఆ డబ్బులు ఇస్తే తాము పని చేసి పెడతామన్నారు. డబ్బుల్లేక అంత దూరం వెళ్లింది.. మళ్లీ లక్షన్నర అంటే ఎక్కడ నుంచి తెస్తారు.. ఓవైపు వేధిస్తున్న అనారోగ్యం.. మరోవైపు ఏజెంట్స్‌కి ఇవ్వడానికి తమ వద్ద అంత డబ్బులు లేకపోవడంతో ఆత్మహత్యే శరణ్యం అనుకున్న వెంకట లక్ష్మి.. భర్తకు వీడియో కాల్ చేసి మాట్లాడుతూనే… ఆత్మహత్యకు పాల్పడింది.
ఇలా ఎంతోమంది.. ఏజెంట్ల చేతుల్లో మోసపోయి.. అష్టకష్టాలు పడుతున్నారు. డబ్బు ఆశ చూపించి తీసుకెళ్తారు.. తీరా అక్కడి వెళ్లాక వాళ్లు చెప్పింది చేయాలి.. భాష రాదు, చుట్టూ మన అన్నవాళ్లు ఒక్కరూ ఉండరూ.. ఊరికాని ఊర్లో..ఎందుకంత తిప్పలు..ఆ కష్టమేదో మన దగ్గరే చేస్తే..కుటుంబంతో కలిసి ఉండొచ్చు కదా! ఇలా ఉపాధి కోసం వెళ్లేవాళ్లకు అక్షరం ముక్కరాదు..ఏజెంట్లు కూడా ఇలాంటి వారినే టార్గెట్ చేసుకుంటారు.. జాగ్రత్తగా ఉండండి.. మీకు తెలిసినవాళ్లలో ఎవరికైనా ఇలా వెళ్లాలి అనే ఆలోచన ఉంటే.. ఈ ఘటనలు చెప్పి అప్రమత్తం చేయండి.