జగన్‌కు ఉండవల్లి అలెర్ట్: అర్ధం అవ్వకపోతే కష్టమే?

-

ఏపీలో జగన్ పాలనపై నిత్యం ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండున్నర ఏళ్లలో చాలా అంశాల్లో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని టీడీపీ తప్పుబట్టింది. అయితే టీడీపీ విమర్శలు చేస్తే వైసీపీ కూడా కౌంటర్లు ఇచ్చింది. ఓ రకంగా బూతులతో వైసీపీ నేతలు తిడుతూ వస్తున్నారు. అటు టీడీపీ నేతలు కూడా బూతులు మాట్లాడుతూ వస్తున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య బూతుల పర్వం నడుస్తోంది. చివరికి అది ఎక్కడ వరకు దారితీసింది…ఇటీవల భువనేశ్వరి ఇష్యూలో అర్ధమైంది.

అయితే ప్రతిపక్షం అన్నాక విమర్శలు చేయడం సహజమే… కానీ అధికార పక్షం బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ అంశంతో పాటు అప్పులతో ప్రభుత్వాన్ని నడిపించడం, అలాగే వైసీపీ నేతల అక్రమాలపై సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైర్ అయ్యారు. జగన్‌ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని, జగన్ ఈ రెండేళ్లలోనే ఘోరంగా విఫలమయ్యారని, జగన్‌ పాలనలో అవినీతి లేదని ఎవరైనా చెప్పగలరా..?అని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తోందని, అప్పుల కోసం అన్నింటినీ ఒప్పుకుంటున్నారని, ఇలాగే చేసుకుంటూ పోతే భవిష్యత్‌లో అప్పులు తీసుకునే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. అలాగే ఏపీ అసెంబ్లీలో తాజాగా జరిగిన ఘటనలపై కూడా ఉండవల్లి సీరియస్ అయ్యారు. ఎన్టీఆర్‌ కుమార్తెల గురించి తానెప్పుడూ ఎలాంటి పుకార్లు వినలేదని, చంద్రబాబు కన్నీళ్లు డ్రామా అని అనుకోవడం లేదని, కాకపోతే చంద్రబాబు అంతలా స్పందించాల్సిన సమస్య కానేకాదని అన్నారు.

అలాగే మంత్రి కొడాలి నాని గురించి పరోక్షంగా మాట్లాడారు. చంద్రబాబుని…రేయ్‌, వాడు, వీడు అనడం సర్వసాధారణం అయిపోయిందని, విపక్ష నేతలని వైసీపీ మంత్రులు గౌరవించాలని, విపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం అని, విపక్షంలేని అసెంబ్లీలో వైసీపీ నేతలు భజన చేశారు.. పాటలు పాడారు అని ఉండవల్లి ఫైర్ అయ్యారు.

అయితే ఎప్పుడు కూడా ఉండవల్లి…జగన్ ప్రభుత్వంపై ఈ స్థాయిలో విమర్శలు చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు చేసే పరిస్తితి వచ్చిందంటే వైసీపీలో తప్పులు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఆ తప్పులని తెలుసుకుని జగన్…పార్టీ నేతలని లైన్‌లో పెట్టాలి. తప్పులని సరిచేయాలి. అలా కాకుండా ఇదే వరుసలో వెళితే జగన్‌కు ఎదురుదెబ్బ తగడలం ఖాయమని ఉండవల్లి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లే అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version