టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లని పెద్దగా పట్టించుకోట్లేదు. తెలుగు మాట్లాడే వాళ్లు, తెలుగు కథలని అర్థం చేసుకునేవాళ్లు అక్కర్లేదు, టింగ్లిష్ మాట్లాడే వాళ్లే కావాలన్నట్లు పక్క రాష్ట్రాల నుంచి హీరోయిన్లని తీసుకొస్తున్నారు. లోకల్ టాలెంట్‌ని దూరం పెడుతున్నారు.
విజయ్ దేవరకొండ “వరల్డ్ ఫేమస్ లవర్’లో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. నార్త్ లేడీ రాశీ ఖన్నా, మల్లూ బేబీ కేథరీన్ థ్రేసా, బ్రెజిల్ బ్యూటీ ఇజబెల్లాతో పాటు తెలుగు అమ్మాయి ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ నలుగురిలో తెలుగు అమ్మాయి ఐశ్వర్యా పెర్ఫామెన్సే సినిమాకి హైలెట్‌గా నిలిచింది. అయితే ప్రశంసలు వచ్చినా ఈమెకి భారీ అవకాశాలు మాత్రం రాట్లేదు. ఇక్కడ నాని “టక్ జగదీష్’, “భూమిక’ లాంటి చిన్న సినిమాలు చేస్తోంది ఐశ్వర్య.
బ్యూటీ పేజెంట్‌లో అదరగొట్టి, బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తోన్న తెలుగు అమ్మాయి శోభిత దూళిపాళ. అడివి శేష్ “గూఢచారి’తో టాలీవుడ్‌లోనూ మెరిసిన ఈ హీరోయిన్‌కి తెలుగునాట మాత్రం పెద్దగా అవకాశాలు రాట్లేదు. ఇప్పుడు శోభితకి అడివి “మేజర్’ తప్ప మరో తెలుగు సినిమా లేదు. “పెళ్లిచూపులు’ సినిమాతో నంది అవార్డ్ కూడా అందుకున్న తెలుగమ్మాయి రీతూ వర్మ. అయితే ఈ హీరోయిన్‌కి “కేశవ’ తర్వాత మరో తెలుగు సినిమా చెయ్యడానికి మూడేళ్లు పట్టింది. “టక్ జగదీష్’తో మళ్లీ తెలుగు తెరపై కనిపిస్తోంది రీతు. అయితే ఈ మూడేళ్లు తెలుగు మేకర్స్ ఈమెని పక్కనపెట్టినా, తమిళనాట మాత్రం వరుస అవకాశాలొచ్చాయి.