దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే యువత, నిరుద్యోగ అభ్యర్థులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ)ని ప్రవేశపెట్టింది. దీన్ని 2008వ సంవత్సరం నుంచే అమలు చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ రోజ్‌గార్ యోజన (పీఎంఆర్‌వై), రూరల్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (ఆర్ఈజీపీ) అనే రెండు పథకాలను కలిపి పీఎంఈజీపీని అమలు చేస్తున్నారు. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని కింద ఔత్సాహికులు రుణాలు పొంది స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకోవచ్చు.
పీఎంఈజీపీ కింద కొత్త అభ్యర్థులకు మాత్రమే రుణం ఇస్తారు. వ్యవసాయేతర రంగాలకు చెందిన కార్మికులు, నిరుద్యోగులు, యువతకు ఈ పథకం కింద రుణాలను ఇస్తారు. గ్రామీణ, పట్టన, నగర ప్రాంతాల్లో ఉన్న వారు ఈ పథకాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందవచ్చు. ఇక దీన్ని జాతీయ స్థాయిలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) అమలు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కేవీఐసీ డైరెక్టరేట్లు, స్టేట్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్స్ (కేవీఐబీలు), డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్లు (డీఐసీలు), బ్యాంకులు అమలు చేస్తాయి.
ఈ పథకం కింద ఉత్పత్తి రంగానికి చెందిన పరిశ్రమను పెట్టదలిస్తే గరిష్టంగా రూ.25 లక్షల వరకు రుణం ఇస్తారు. అదే సేవా రంగానికి చెందిన వ్యాపారం అయితే రూ.10 లక్షల వరకు రుణం ఇస్తారు. తీసుకున్న రుణంలో అభ్యర్థి ఉన్న ప్రదేశాన్ని బట్టి సబ్సిడీ ఇస్తారు. అర్బన్ జనరల్ విభాగం అభ్యర్థులకు 15 శాతం, రూరల్ 25 శాతం, అర్బన్ స్పెషల్ విభాగం అభ్యర్థులకు 25 శాతం రుణంలో సబ్సిడీ ఇస్తారు. అలాగే స్పెషల్ రూరల్ అయితే 35 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. ఈ విభాగం కిందకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు, ఎన్ఈఆర్, కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వస్తారు.
ఇందులో భాగంగా రుణం తీసుకుంటే బ్యాంకులు రుణాలను టర్మ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్ గా అందిస్తాయి. ఇక 18 ఏళ్లకు పైబడి ఉండి, 8వ తరగతి పాస్ అయిన ఎవరైనా ఈ పథకం కింద రుణం తీసుకోవచ్చు. వారికి మానుఫాక్చరింగ్ సెక్టార్ అయితే రూ.10 లక్షల వరకు, బిజినెస్ లేదా సేవా రంగం అయితే రూ.5 లక్షల వరకు రుణం ఇస్తారు. కేవలం కొత్తగా దరఖాస్తు చేసేవారికే రుణాలను అందిస్తారు. ఇక ఇతర ఏ స్కీంల కింద రుణాలను తీసుకోని స్వయం సహాయక బృందాలకు, 1860 సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్టు ప్రకారం రిజిస్టర్ అయిన సొసైటీలు, చారిటబుల్ ట్రస్టులకు కూడా ఈ పథకం కింద రుణాలను ఇస్తారు.
ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలనుకునే వారు తమకు సమీపంలోని కేవీఐసీ కేంద్రాన్ని లేదా డీఐసీలను సంప్రదించవచ్చు. లేదా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేయవచ్చు.