హుజురాబాద్ ఉప ఎన్నికకు నగారా మోగింది. ఈ రోజు ఉదయం 11గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్నది. సెలువు రోజులు మినహా ఈ నెల 8 వరకు ప్రతిరోజు నామినేషన్లను స్వీకరిస్తారు. ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనుండగా హుజురాబాద్ ఎన్నికల అధికారి సీహెచ్ రవీందర్‌రెడ్డి వ్యవహరించనున్నారు. అయితే, ఉప ఎన్నికల సాక్షిగా తమ నిరసన గళం విప్పాలని నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు చూస్తుండటంతో ఆసక్తి నెలకొంది. పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేస్తుండటంతో పోటీదారుల సంఖ్య భారీగానే పెరగనున్నది.
- 2018, శాసనసభ ఎన్నికల్లో హుజురాబాద్ బరిలో కేవలం 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉప ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉండనున్నట్లు తెలుస్తున్నది.
- టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని నిలపడం కోసం ప్రయత్నాలు చేస్తున్నది. కాంగ్రెస్ తరఫున పోటీ కోసం 19 మంది నాయకులు దరఖాస్తులను చేసుకోగా, నలుగురు పేర్లతో కూడిన ప్రతిపాదనలను రాష్ట్ర నేతలు ఏఐసీసీకి పంపినట్లు తెలుస్తున్నది. టీడీపీ కూడా బరిలో నిలువనున్నది. త్వరలో అభ్యర్థిని ఖరారు చేస్తామని ప్రకటించింది. ఇటీవల ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ హుజురాబాద్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నది. నిరుద్యోగులకు మద్దతు ప్రకటించింది.
- ఉప ఎన్నికల ద్వారా తమ వాణిని వినిపించాలని విధుల నుంచి తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే హుజూరాబాద్ కేంద్రంగా కొన్ని నెలల క్రితం రాష్ట్రస్థాయి సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించుకుని పోటీ చేస్తామని స్పష్టం చేశారు. నామినేషన్‌కు అవసరమైన డిపాజిట్ కోసం ఆయా జిల్లాలో భిక్షాటన సైతం చేశారు.
- ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు సైతం అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఝలక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసి తమ నిరసనను తెలియజేయాలని చూస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగులకు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ మద్దతు ప్రకటించింది.
- ప్రధాన పార్టీలతో సహా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయనుండటంతో అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉన్నది.
- 2018, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి 60,604 ఓట్లను సాధించారు. కానీ, అనూహ్యంగా పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో హస్తం పార్టీ ఉప ఎన్నికల్లో పోటీపై సందిగ్ధంలో పడింది.