జైళ్లలో శిక్ష పూర్తి చేసుకున్నప్పటికీ జరిమానా చెల్లించలేక అక్కడే మగ్గిపోతున్న ఖైదీలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని వెంటనే విడుదల చేయాలని ఇప్పటికే రాష్ట్రాలకు సూచించినట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ రాజ్యసభలో వివరణ ఇచ్చారు. బిల్కిస్ బానో కేసు దోషుల విడుదల అంశాన్ని లేవనెత్తుతూ కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు.
‘శిక్ష పూర్తి చేసుకున్నప్పటికీ జరిమానా చెల్లించలేక జైళ్లలోనే ఉండిపోయిన ఖైదీలను విడుదల చేసేందుకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాం. అటువంటి వారిని ఆగస్టు 15, 2022, జనవరి 26, 2023, ఆగస్టు 15, 2023ల్లో విడుదల చేసేందుకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేశాం’ అని కాంగ్రెస్ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఖైదీల్లో 80శాతం మంది విచారణ ఖైదీలేనని.. ఆ సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని ఎంపీ అడిగిన ప్రశ్నకూ కేంద్రమంత్రి ఈ సమాధానం ఇచ్చారు. దేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రమైనదని.. విచారణ ఖైదీలపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం కోర్టులకు మాత్రమే ఉంటుందని చెప్పారు. ఈ సమాధానం చెప్పడంపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ.. జైళ్లలో విచారణ ఖైదీలు మగ్గిపోతుండడంపై భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.