బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ఆయన తెలంగాణలో జంగ్ సైరన్ మోగించారని.. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్న ఆయన.. ఇక్కడి ప్రజలు సుష్మా స్వరాజ్ను చిన్నమ్మగా పిలుచుకుంటారని తెలిపారు.
రాష్ట్రంలో ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతోందని..కేసీఆర్ కుటుంబ పాలన అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందని షెకావత్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలకు మాత్రమే కేసీఆర్ మద్దతు ఇచ్చారని ఆరోపించారు. అణగారిన వర్గాలంటే కేసీఆర్ కు గిట్టదన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గద్దెదిగితేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. యాదగిరిగుట్టలో జరిగిన బీజేపీ ప్రజా సంగ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన షెకావత్..సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందలు తెలిపారు.
ఇంజనీరింగ్ లోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపు హౌస్లు మునిగాయని కేంద్ర మంత్రి షెకావత్ అన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని..కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు డబ్బు సంపాదించే మిషన్ గా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయహోదా ఇవ్వలేదని అడుగుతున్న కేసీఆర్… ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని విమర్శించారు.