జడ్జిలు తమ కర్తవ్యాన్ని వదిలేసి రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొలీజియం ద్వారా జరుగుతున్న జడ్జిల నియామక ప్రక్రియలో మార్పులు రావాలని ఆకాంక్షించారు. అహ్మదాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్ మ్యాగజైన్ పాంచజన్య నిర్వహించిన ‘సాబర్మతి సంవాద్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. జడ్జిలను తక్కువ చేసి మాట్లాడటం పట్ల కిరణ్ రిజిజుపై న్యాయమూర్తులతోపాటు న్యాయవాదులు, కోర్టుల సిబ్బంది తీవ్రంగా నిరసిస్తున్నారు.
న్యాయవ్యవస్థ కార్యకలాపాలు పారదర్శకంగా లేవని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు. అక్కడ చాలా రాజకీయం జరుగుతోందని, ఈ రాజకీయం బయటికి కనిపించదని, అయితే ఇక్కడ అనేక విభేదాలు, ఫ్యాక్షనిజం కూడా కనిపిస్తోందని ఆరోపించారు. న్యాయమూర్తులు న్యాయం చేయడానికి బదులు కార్యనిర్వాహకులుగా వ్యవహరించాలని చూస్తే తాము మొత్తం వ్యవస్థనే పునఃపరిశీలించాల్సి ఉంటుందని రిజిజు హెచ్చరించారు.
సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో రాజకీయాలకు తావులేదన్న రిజిజు.. దేశంలో న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. జడ్జిలే జడ్జిలను నియమించే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదని, కేవలం మన వద్దనే ఆచరణలో ఉన్నదని చెప్పారు. ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.