కరోనా వైరస్ ఇండియాలో క్రమంగా విస్తరిస్తోంది, నిన్న మొన్నటి దాకా సామాన్యులకి మాత్రమే పరిమితం అయిన ఈ కేసులు ఇప్పుడు నేతలను, సెలబ్రిటీలను టెన్షన్ పెడుతున్నాయి. ఇక తాజాగా మరో కేంద్ర మంత్రికి కరోనా సోకింది. ఆయన మరెవరో కాదు కేంద్ర ఆయుష్ శాఖా మంత్రి శ్రీపాద నాయక్. తాను కరోనా బారిన పడ్డానని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈరోజు టెస్ట్ చేయించుకున్నా, నాకు ఎటువంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్ వచ్చింది, లక్షణాలు ఏవీ లేకున్నా కారణంగా నేను ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండాలని అనుకుంటున్నానని అన్నారు.
కొద్ది రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారందరూ తగు జాగ్రత్తలు తీసుకుని టెస్ట్ లు చేయించుకోవాలని ఆయన కోరారు. బ్రిటన్ యువ రాజు ప్రిన్స్ ఛార్లెస్‌కు సోకిన కోవిడ్-19 వైరస్ ఆయుర్వేదం, హోమియోపతి చికిత్స ద్వారా నయమైందని బల్ల గుద్ది వాదిస్తోన్న ఈయన ఆయుర్వేదాన్ని వాడకుండా ఒక వర్గం అడ్డుకొంటోందని కూడా కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. మనిషి రోగ నిరోధక వ్యవస్థపై కరోనా వైరస్ దాడి చేస్తుందన్న ఆయన రోగనిరోధకతను పెంచుకుంటే వైరస్ దాడి చేయలేదని, శ్వాస వ్యవస్థ దెబ్బతింటే దానిని బాగుచేసే పరిష్కారమూ మనవద్ద ఉందని ఆయన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.