సాధారణంగా హార్మోన్ల మార్పులు మూడ్ స్వింగ్స్ అంటే ఆడవారికి మాత్రమేనని అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. మగవారిలో కూడా రోజూ నెలవారీగా హార్మోన్ల హెచ్చుతగ్గులు ఉంటాయి. ముఖ్యంగా శక్తిని మానసిక స్థితిని శారీరక పనితీరును ప్రభావితం చేసే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఒక సైకిల్‌ను అనుసరిస్తుంది. ఈ ‘మెన్’స్ట్రువల్ సైకిల్ గురించి చాలామందికి తెలియదు. ఆ మగవారి హార్మోనల్ సైకిల్ ఎలా పనిచేస్తుంది? దాని ప్రభావాలు ఏమిటి? తెలుసుకుందాం.
మగవారిలో ప్రధాన హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్థాయిలు 24 గంటల చక్రం (డైలీ సైకిల్) మరియు నెలవారీ చక్రం రెండింటినీ అనుసరిస్తాయి. సాధారణంగా ఉదయం లేవగానే టెస్టోస్టెరాన్ స్థాయిలు గరిష్టంగా ఉండి రోజంతా క్రమంగా తగ్గుతూ, సాయంత్రం లేదా రాత్రికి కనిష్ట స్థాయికి చేరుకుంటాయి. అందుకే చాలామంది మగవారు ఉదయం పూట ఎక్కువ శక్తితో, చురుకుగా ఉంటారు. రోజువారీ ఈ మార్పుల కారణంగానే ఒకే వ్యక్తిలో ఉదయం ఉండే ఉత్సాహం, సాయంత్రానికి తగ్గుముఖం పట్టి నిదానం లేదా చిరాకు కనిపించవచ్చు.

ఇది కాకుండా, టెస్టోస్టెరాన్ స్థాయిలలో నెలకు ఒకసారి పెద్దగా లేదా కొద్దిగా హెచ్చుతగ్గులు సంభవించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ హార్మోనల్ సైకిల్ కారణంగానే మగవారిలో కూడా అకస్మాత్తుగా శక్తి తగ్గడం, కారణం లేకుండా మూడీగా ఉండటం, కోపం లేదా సున్నితత్వం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సైకిల్ గురించి అవగాహన పెంచుకోవడం వలన తమలో, తమ భాగస్వామిలో వచ్చే మార్పులను అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా జీవనశైలిని మార్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
గమనిక: మగవారిలో హార్మోన్ల మార్పులు అనేవి వ్యక్తిని బట్టి, వయస్సును బట్టి, జీవనశైలిని బట్టి మారుతూ ఉంటాయి. తీవ్రమైన మూడ్ స్వింగ్స్ లేదా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
