కరోనా కట్టడి సమావేశాల్లో తలమునకలైఉన్న ముఖ్యమంత్రి తాను తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి, ఆనంద్ సింగ్ బిష్త్ ( 94) ఈ రోజు ఉదయం 10.44 గంటలకు ఎయిమ్స్‌లో కన్నుమూసారు. తండ్రి మరణవార్తతో దుఃఖంలో మునిగిపోయిన ముఖ్యమంత్రి, తాను రేపు జరగబోయే తండ్రి ఉత్తర క్రియలకు హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. కరోనా వ్యాధి కట్టడికి సంబంధించిన పనుల్లో తీరిక లేకుండా ఉన్నందున తాను తండ్రికి తలకొరివి పెట్టలేకపోతున్నట్లు తెలిపిన యోగి, తన తండ్రి తనకు కష్టపడే తత్వం, నిజాయితీ, నిస్వార్థం నేర్పారని, చివరి ఘడియల్లో ఆయనకు తోడుండాలని అనుకున్నానని, కానీ 23 కోట్ల యూపీ ప్రజలను కాపాడే బాధ్యతలను మరిచి వెళ్లలేనన్నారు. తన తల్లి, ఇతర సమీప బంధువులను కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరిన యోగి, తండ్రి అంత్యక్రియల సందర్భంగా లాక్‌డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు.
కరోనా కట్టడిపై సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రికి ఈ దుర్వార్త తెలిసింది. అయినప్పటికీ బాధను దిగమింగుకుంటూ మీటింగ్ పూర్తి చేసిన సీఎం, తర్వాత భోరున విలపించారు. స్మృతి ఇరానీ, ప్రియాంకా గాంధీ, అఖిలేశ్ యాదవ్, పలువురు ప్రముఖులు, పితృవియోగం పొందిన యోగి ఆదిత్యనాథ్‌కు తమ సంతాపాన్ని తెలియజేసారు. కాగా ఆనంద్‌సింగ్ అంత్యక్రియలు రేపు ఉత్తరాఖండ్, పౌరీ జిల్లాలోని స్వగ్రామంలో జరుగనున్నాయి.