షాద్‌నగర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ స్టేషన్ దగ్గర విద్యార్థినులు, ప్రజాసంఘాలు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వైద్యురాలి హత్య ఘటనలో నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు భారీగా పీఎస్‌కు చేరుకోవడంతో… వారిని నిలువరించడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఆందోళనకారుల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది.
ఇదిలా ఉండగా.. ప్రియాంకరెడ్డిని హత్య చేసిన మానవ మృగాలకు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లోనే వైద్య పరీక్షలను నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులు శ్రీనివాస్, సురేందర్ లు ఈ పరీక్షలు చేశారు. వైద్య పరీక్షలు పూర్తి కావడంతో నలుగులు నిందితులను కోర్టుకు తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు, షాద్ నగర్ కోర్టులో జడ్జిలు అందుబాటులో లేరని తెలుస్తోంది. దీంతో, వీరిని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు సమాచారం.