ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ నిరంతర దాడులతో గాజాలో భీకర పరిస్థితులు సృష్టిస్తోంది. ఈ యుద్ధం వల్ల దాదాపు ఆరు లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఈ దుస్థితిపై ఐరాస ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాజా వాసులకు సాయం చేసేందుకు అమెరికా రంగంలోకి దిగింది.
మూడు సీ-130 సైనిక రవాణా విమానాల సాయంతో అమెరికా మొదటి సారి దాదాపు 38 వేల ఆహార పొట్లాలను జార విడిచింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో గాజాకు మానవతా సాయం ఎంతో అవసరమని,. దాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. జోర్డాన్ సమన్వయంతో ఆహార పొట్లాల పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ల్యాండింగ్, దాదాపు 19 టన్నుల బరువు మోసుకెళ్లగల సామర్థ్యం కారణంగా మారుమూల ప్రాంతాలకు సహాయక సామగ్రి చేరవేతలో ‘సీ-130’ విమానాలను అమెరికా విస్తృతంగా ఉపయోగిస్తోంది.