హుజూర్‌నగర్ ఉప ఎన్నిక టీ పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అగ్ని పరీక్షగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైన దక్కించుకోవాలని ఆయన పడరాని పాట్లు పడుతున్నారు. తన సతీమణి పద్మావతిరెడ్డి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో వివిధ పార్టీల మద్దతు కూడ గట్టేందుకు ఆయన శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ముందుస్తుగానే సీపీఐ నేతలను కలిసి మద్దతు తమ పార్టీకే మద్దతివ్వాలని ఆయన కోరారు. అయితే పార్టీలో చర్చించి, తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి ఉత్తమ్‌కు షాక్ ఇచ్చారు.
తాము అధికార టీఆర్ ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించడంతో ఇక ఉత్తమ్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి లు టీజేఎస్ కార్యాలయానికి వెళ్లి ఆపార్టీ అధ్యక్షుడు కోదండరాంతో పాటు ఇతర నేతలతో సమావేశం అయ్యారు. ఇంతకు ముందే ఓసారి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోదండరాంను కలిశారు. అయితే పార్టీలో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని కోదండరాం కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయకపోయినా.. కీలకంగా పని చేస్తామని కోదండరాం అన్నారు. ఈ ఈక్రమంలోనే తమ నిర్ణయాన్ని బుధవారం వెల్లడిస్తామని పార్టీ నేతలు ప్రకటించారు. మరోవైపు హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో సీపీఎం పార్టీ అభ్యర్థి శేఖర్‌రావు నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో… ఆ పార్టీ నేతలతో కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే సీపీఎం నాయకులు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.
ఇక మరోపక్క కాంగ్రెస్ అగ్ర నేతలందరినీ హుజూర్‌నగర్ లో ప్రచారానికి రప్పించేందుకు ఉత్తమ్ లాబీయింగ్ చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పలువురు నేతలతో ఫోన్లు కూడా చేయించారనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కష్టాలు తెచ్చిపెట్టినట్లయింది.