నీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కీలక సమావేశం.!

-

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జల సంఘం (CWC) చైర్మన్ అతుల్ జైన్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రానికి ప్రాధాన్యత కలిగిన మేడిగడ్డ, సమ్మక్క సారక్క, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై సమగ్ర చర్చ జరిగింది. నీటిపారుదల శాఖ అధికారుల బృందం కూడా ఈ సమావేశానికి హాజరైంది. జాతీయ డ్యామ్ సంరక్షణ సంస్థ (NDSA) సమర్పించిన నివేదికలో మేడిగడ్డ డ్యామ్ డిజైన్, నిర్మాణం, ఆపరేషన్ లో భారీ లోపాలు ఉన్నాయని స్పష్టం చేయడంతో, దీనిపై మంత్రి స్పందించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూసేందుకు మేము పునరుద్ధరణ మార్గాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. డీపీఆర్‌లో చూపిన ప్రదేశానికి భిన్నంగా వేరే ప్రాంతంలో నిర్మాణం జరగడం తగదని వ్యాఖ్యానించారు.

సుందిళ్ల బ్యారేజ్‌తో పాటు మేడిగడ్డ బ్యారేజ్‌కు సంబంధించిన అంశాలపై కేంద్ర జల సంఘంతో మరింత సంప్రదింపులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్డీఎస్సీ కూడా దీనిపై స్పష్టమైన సూచనలు చేసినట్టు తెలిపారు. తుమ్మిడి హట్టి వద్ద కొత్త ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని వెల్లడించారు. అలాగే సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు 44 టీఎంసీల నీటిని అత్యవసరంగా కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం 90 టీఎంసుల నుంచి ముందుగా 45 టీఎంసులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది నుంచి అక్రమంగా నీటి తరలింపులను నిరోధించేందుకు నదిపై వివిధ ప్రదేశాల్లో టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. అలాగే పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా ముంపు ప్రమాదాన్ని నివారించేందుకు రిటెన్షన్ వాల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news