మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. గన్నవరం టీడీపీ కార్యాలయం పై జరిగిన దాడి కేసులో వంశీకి మే 21వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా జైలులో ఉన్న వంశీని పోలీసులు కోర్టుకు హాజరు పరిచిన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఇప్పటికే వంశీపై సత్యవర్థన్ కిడ్నాప్ కేసు కూడా నడుస్తోంది.
ఇందులో రిమాండ్ గడువు నిన్న ముగియడంతో, ఆయన్ను విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మే 13 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో వంశీతో పాటు వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబు కూడా రిమాండ్‌లో ఉన్నారు. నిన్న వీరందరినీ కోర్టులో హాజరు పరచగా, అందరికీ రిమాండ్ కొనసాగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇంకా పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు శోధన కొనసాగిస్తున్నారు.