దేశంలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు మూడు లక్షలపైన నమోదైన కేసులు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ మహమ్మారి వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ కబలిస్తోంది. అయితే కరోనా విలయం కొనసాగుతున్న ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ వాహనదారులకు శుభవార్త చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్ సి) చెల్లుబాటు గడువును మరోసారి పెంచింది కేంద్రం.
ఈ నెల 30 వరకు ఇవి చెల్లుబాటు అవుతాయని గతంలో చెప్పిన కేంద్రం.. తాజాగా దీనికి సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. కరోనాను కట్టడి చేయాల్సిన అవసరం ఉన్న ఈ పరిస్థితిలో ఫిట్నెస్, పర్మిట్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటి పత్రాలకు సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర రవాణా శాఖ. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది.