జల దోపిడీ పై బహిరంగ చర్చకు సిద్ధమా: వంశీచంద్​ రెడ్డి

-

పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరంల ద్వారా ఏపీ చేయనున్న జలదోపిడీపై చర్చకు రావాలని సవాల్‌ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా తనపై ఉందన్న ఆయన… ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అనేక అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.


తెలంగాణ గడ్డపై ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చక పోగా… రాయలసీమ గడ్డపై చేసిన “రాయలసీమను రతనాలసీమ చేస్తా” అన్న వాగ్ధానాన్ని నెరవేర్చడానికి కంకణబద్ధులై ఉన్నట్లున్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసే విషయంలో తమకేమీ అభ్యంతరం లేదని… తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తూ, ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తీవ్ర నష్టం కలిగేలా వ్యవహరించడాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి వెళ్లకుండా…

వాయిదా కోరడంపై అనేక సందేహాలు ఉన్నాయని ఆరోపించారు. గతంలో టీఆర్ఎస్ నాయకుడిగా నిరంజన్ రెడ్డి బహిరంగ చర్చకు చేసిన సవాలును హుందాగా స్వీకరించానని… ఇప్పుడు బహిరంగ చర్చకు తాను విసిరిన సవాలును కూడా స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. రేపు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 11 గంటల నుంచి వేచి చూస్తానని… ముఖ్యమంత్రి లేదా ఆయన ప్రతినిధి బహిరంగ చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version