కలెక్టర్ కార్యాలయంలోని శనివారం సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టం సాధించిన అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిదేళ్లుగా సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. జూన్ 2 న పతాకావిష్కరణ, దశాబ్ది ఉత్సవ సందేశం తో ఉత్సవాలు ప్రారంభమై జూన్ 22 అమరవీరుల సంస్మరణ సభ, అమరవీరుల స్తూపం అవిష్కరణతో ముగిస్తున్నట్లు తెలిపారు. 20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలన్నారు.
రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతు వేదికల వద్ద ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయాలని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు లాగే కామారెడ్డి జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని, అదే విధంగా నూతన మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత దగ్గరైందని అన్నారు. కొత్త జిల్లాగా ఏర్పాటు అయిన కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు.