తమ్ముడు కోసం వెంకన్న…స్కెచ్ బాగుందే!

-

కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కాంగ్రెస్…ఇది ఒకప్పటి పరిస్తితి…ఇప్పుడు సీన్ మారింది…కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే బీజేపీ అనే పరిస్తితికి వచ్చింది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక ఈ నెల 21న బీజేపీలో చేరనున్నారు. అలాగే మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలబడనున్నారు. ఇక్కడ వరకు రాజగోపాల్ ఎపిసోడ్ సుఖాంతం అయింది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్తితి ఏంటి అనేది క్లారిటీ రావడం లేదు.

రేవంత్ రెడ్డికి పి‌సి‌సి అధ్యక్షుడు పదవి వచ్చిన దగ్గర నుంచి ఈయన అసంతృప్తిగానే ఉన్నారు. పార్టీపై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అలాగే మధ్య మధ్యలో బీజేపీ పెద్దలతో భేటీ అవుతూనే ఉన్నారు. అయితే ఒక ఎంపీగా మాత్రమే కేంద్ర మంత్రులని కలుస్తున్న అని వెంకన్న చెబుతున్నారు. ఇందులో తప్పు లేదు…కానీ కాంగ్రెస్ ఎంపీలంతా అలా చేయడం లేదే…పైగా వారికి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు ఈజీగా దొరికేలా లేవు. మరి వెంకన్నకు అపాయింట్మెంట్లు సులువుగా దొరుకుతున్నాయి.

అందుకే కాంగ్రెస్ పార్టీలో కొందరు వెంకన్నపై విమర్శలు చేస్తున్నారు..తాజాగా కూడా మునుగోడు సభలో అద్దంకి దయాకర్..పార్టీలో ఉంటే ఉండు లేకపోతే వెళ్లిపో అన్నట్లు వెంకన్నని ఉద్దేశించి మాట్లాడారు. తర్వాత దయాకర్ క్షమాపణ కూడా చెప్పారు. అయితే ఇంతవరకు ఈ అంశాలపై స్పందించని వెంకన్న…తాజాగా మాట్లాడుతూ…మునుగోడు ఉపఎన్నికకు దూరంగా ఉంటానని చెప్పారు.

ఉపఎన్నిక కసరత్తు సమావేశానికి సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని, ఏ మీటింగ్‌ జరిగినా తనకు సమాచారం ఇవ్వడం లేదని, చుండూరు  సభలో తనని అసభ్యంగా తిట్టించారని, దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని, తనని పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని, అన్ని విషయాలు సోనియా, రాహుల్‌తో మాట్లాడతానని వెంకన్న చెప్పుకొచ్చారు.

అయితే మునుగోడు ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ…వెంకన్నకు సమాచారం ఇస్తుందో లేదో క్లారిటీ లేదు. కాబట్టి వెంకన్న ఆవేదనలో అర్ధం ఉందని అనుకుందాం…కానీ నిప్పు లేనిదే పొగరాదు అని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. బీజేపీ పెద్దలతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు కాబట్టే..వెంకన్నపై విమర్శలు వచ్చాయని, కావాలనే ఆయన విమర్శించేలా చేసుకుని, తమ్ముడు గెలుపు కోసం మునుగోడు ఉపఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చారని అంటున్నారు. అంటే దూరంగా ఉంటానని చెబుతూనే…బ్యాగ్రౌండ్లో రాజగోపాల్ గెలుపు కోసం పనిచేస్తారని కాంగ్రెస్ శ్రేణులు అనుమానిస్తున్నాయి. మొత్తానికి వెంకన్న తెలివిగానే ముందుకెళుతున్నట్లున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version