దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటంలో మీడియా నిర్వహిస్తున్న పాత్ర అమోఘం అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. కరోనాపై పోరాటంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులతోపాటు ముందువరసలో నిలిచిందన్నారు. మహమ్మారి వ్యాప్తి పట్ల ప్రజలను చైతన్యం చేయడంలో ప్రసార మాధ్యమాలదే కీలకపాత్ర అని పేర్కొన్నారు. జర్నలిస్టులు కరోనా బారిన పడి మృతి చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
అలాగే సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారం చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. మాస్కులు ధరించడం, సురక్షిత దూరాన్ని పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, ఆరోగ్యకరమైన భోజనం, మానసిక ఒత్తిడినుంచి బయటపడేందుకు అవసరమైన శారీరక వ్యాయామం, ఆధ్యాత్మికత ఆవశ్యకత తదితర అంశాలను ప్రచారం చేయడంలో మీడియా అసమాన పాత్ర పోషిస్తున్నదని ఉపరాష్ట్రపతి అన్నారు.