కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో మీడియా అనేది చాలా కీలకం అయింది. మీడియాలో వచ్చే వార్తలను ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మీడియాకు ఒక విజ్ఞప్తి చేసారు. భారతీయ పాత్రికేయులకు ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం శుభాకాంక్షలు చెప్పారు. ఈ సమాచార యుగంలో వాస్తవమైన, సంచలనాలకు తావులేని వార్తను ప్రజలకు అందించడంలో పాత్రికేయులు పోషించాల్సిన పాత్ర మరింత కీలకం. తప్పుడు సమాచారం నుంచి సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిదే అని అన్నారు.
“కరోనా నేపథ్యంలోనూ ప్రజలకు సరైన సమాచారాన్ని అందజేసి, వారిలో ధైర్యాన్ని నింపిన పాత్రికేయుల పాత్ర అభినందనీయం. పత్రికాస్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ, ప్రజల సమస్యలను మరీ ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి విషయంలో మీడియా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఆకాంక్షిస్తున్నాను.” అని కోరారు.