కేసీఆర్‌కు విద్యార్థి లోకం గట్టి గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు విజయశాంతి. తెలంగాణలోని సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వ పర్యవేక్షణ లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నరు. నిర్వాహకుల కక్కుర్తి, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదు. తాజాగా సిద్దిపేట మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 120 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం వండిన చికెన్‌లో మిగిలిన సూప్‌లోనే వంకాయ, ఆలుగడ్డ వేసి కూర వండారు. ఇదే సోమవారం మధ్యాహ్నం విద్యార్థులకు వడ్డించారు. అది తిన్న విద్యార్థులు రాత్రి కల్లా విరేచనాలు చేసుకున్నరు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సీఎం కేసీఆర్ ఇలాకాలోనే సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ జరగడం అత్యంత విచారకరమని… బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఫుడ్ పాయిజనింగ్తో పిల్లలు 5 రోజులు బాధపడ్డారు. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉండడం చూస్తుంటే… కేసీఆర్ సర్కార్‌కు విద్యా వ్యవస్థ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో బాగా అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. సిద్దిపేట మైనార్టీ గురుకులంలో జరిగిన ఆహార కల్తీపై విచారణ చేపట్టి బాధ్యుల్ని శిక్షించాలి. కేసీఆర్ సర్కార్ ఇప్పటికైనా విద్యా వ్యవస్థపై నిర్లక్ష్యం వీడి తగిన సౌకర్యాలు కల్పించాలి. బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కనీస సౌకర్యాల కోసం ఉద్యమం చేయల్సి వచ్చింది. ఇలా కేసీఆర్ ప్రభుత్వం ప్రతిదానిలోనూ విద్యార్థులకు ఆనాయ్యమే చేస్తోంది. విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాన్నారు విజయశాంతి.