మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సంక్రాంతి వేడుకల కోసం స్వగ్రామం నారావారిపల్లె వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వివాదాదస్పద జీవో నెం.1 ప్రతులను భోగిమంటల్లో వేయడం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ప్రజల చేత ఎన్నికైన ఓ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను తగులబెట్టడం అంటే భారతీయ చట్టం, ప్రజాస్వామ్యం పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించడమేనని పేర్కొన్నారు. ఇవాళ జీవో ప్రతులను తగులబెట్టాడు… రేపు రాజ్యాంగాన్ని తగులబెడతాడేమో! అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. “గతంలో ఒకరు బహిరంగంగా ప్రభుత్వ పత్రాలను చించివేసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారో అందరికీ తెలుసు. నియంత పోకడలు అంటే ఇవే” అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. చంద్రబాబు తన స్వగ్రామమైన నారావారిపల్లెలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు. నారా, నందమూరి ఫ్యామిలీలు కలిసి భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో 1 ప్రతులను చంద్రబాబు భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. జీవో 1ను వ్యతిరేకిస్తూ చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాల సభను అడ్డుకునేందుకు కుట్రపూరితంగా పాత కాలం నాటి జీవోను తీసుకొచ్చారని, ఈ జీవో చెల్లదని చంద్రబాబు విమర్శించారు.