టీడీపీ అధినేత చంద్రబాబు ఐటీని, సెల్ ఫోన్‌ను తానే కనిపెట్టానని చెబుతారని, అదే నిజమైతే వాటి పేటెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు. 1962 నుంచి అంతరిక్ష పరిశోధనలను తమ పార్టీ ఎంతో ప్రోత్సహించిందని కాంగ్రెస్ చెబుతుంటే 2014 నుంచి మేం అందించిన సహకారంతోనే ఇస్రో ఇన్ని ఘన విజయాలు సాధించిందని బీజేపీ చెప్పుకుంటోంది.
వీళ్ళిద్దరి మధ్య అనేక వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికినట్లు చెప్పుకునే ముఖ్యమైన మూడో వ్యక్తి ఉన్నారు. ఆయనే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఐటీ విప్లవం తీసుకువచ్చానని, కంప్యూటర్‌ను, సెల్ ఫోన్‌ను తానే కనిపెట్టానని ఆయన ఇప్పటికే వందలసార్లు ప్రకటించుకున్నారు. ఆయన ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలి. ఆయన చెప్పుకుంటున్నట్లుగా ఐటీ, కంప్యూటర్లు, సెల్ ఫోన్ ఆవిష్కరణల సృష్టికర్త ఆయనే అని రుజువైతే వాటిపై భారత్ పేటెంట్ హక్కులు పొందవచ్చు. తద్వారా ఆ పేటెంట్‌లను వినియోగించుకుంటున్న ఐటీ కంపెనీలు, కంప్యూటర్ తయారీ కంపెనీలు, సెల్ ఫోన్ కంపెనీల నుంచి వేల కోట్ల రూపాయలను రాయల్టీ కింద రాబట్టవచ్చని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.