ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లాలో ఏపీ పంచాయతీ ఎన్నికల చిచ్చు రేపాయి. ఏపీ టీడీపీ అధ్యక్ష్యుడు అచ్చెన్నాయుడు తన స్వగ్రామంలో స్వంత బందువు వైసీపీ తరఫున నామినేషన్ వేస్తుంటే దానిని అడ్డుకునేందుకు ఫోన్ లో మాట్లాడారు. ఆ ఫోన్ కాల్ ఇప్పుడు ఆయన కొంపముంచింది..ప్రలోభాలకు గురి చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు అని ఆయన మీద పోలీస్ కేసు నమోదు కావడంతో ఈ రోజు ఉదయం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
అయితే పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు తెలుగుదేశం శ్రేణులు తరలి వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. మరో పక్క అచ్చెన్నాయుడు గ్రామానికి ఈరోజు విజయసాయిరెడ్డి వెళుతున్నారు. దీంతో ఆయన పర్యటనను అడ్డుకోవడానికి టిడిపి నేతలు ప్రయత్నిస్తారనే సమాచారంతో ఎక్కడికక్కడ జిల్లాలో టిడిపి నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికి రాజాం నుంచి బయలుదేరిన కళా వెంకట్రావుని అరెస్ట్ చేసి ఆయన స్వగృహంలోనే ఉంచారని తెలుస్తోంది. పెద్ద ఎత్తున టిడిపి నేతలు నిమ్మాడ చేరుకుంటారనే సమాచారంతో పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు.