దుబ్బాక లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు రెండు కేంద్రాల్లో ఓటు లెక్కించక పోవడంతో కాస్త సందిగ్ధత నెలకొన్నా అక్కడ కూడా వెయ్యికి పైగా ఓట్ల మెజారిటీతో బిజెపి గెలుపొందినట్లు అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరో శుభవార్త బీజేపీ శ్రేణులకు అందుతోంది. అదేంటంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతి మళ్లీ తన సొంత గూటికి అంటే బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.
నిజానికి గతంలో ఆమె 24వ తేదీన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా ఈ రోజు దుబ్బాక ఎన్నికల ఫలితాలతో ఆమె మరింత ముందే పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు చెబుతున్నారు. వచ్చే వారమే డిల్లీకి విజయశాంతి వెళ్లనున్నట్లు సమాచారం. అప్పుడే బీజేపీ అగ్రనేతల సమక్షంలో ఆమె కండువా కప్పుకుని పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ముందు పార్టీ పెద్దలతో భేటీ కానున్న విజయశాంతి ఆ తర్వాత పార్టీలో చేరనున్నట్లు ఆమె సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే ఇది ఒక ప్రచారమే కాగా అధికారిక సమాచారం అందాల్సి ఉంది.