దొర గారి పాలనలో అన్నీ ఇబ్బందులే..పేరుకే బంగారు తెలంగాణ అని విమర్శలు చేశారు విజయశాంతి. కేసీఆర్ పేరుకు మాత్రం చెప్పేది బంగారు తెలంగాణ… కానీ దొర గారి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నరు. తాజాగా తెలంగాణలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నయి. భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు ప్రబలుతున్నయి. దోమల వల్ల డెంగీ, మలేరియా… కలుషిత ఆహారం, నీటి వల్ల టైఫాయిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నయని ఫైర్ అయ్యారు.
ఇండ్ల చుట్టూ నీళ్లు నిలిచిపోవడం, డ్రైనేజీలు నిండిపోవడం, ఓపెన్ ప్లాట్లన్నీ మురికి కుంటల్లా మారడంతో దోమలు వృద్ధి చెంది డెంగీ విజృంభిస్తోంది. వర్షాకాలం ప్రారంభంలోనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సిన సర్కారు ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యడంలేదు. వర్షాలు పడి, వరదలు వచ్చిపోయిన తర్వాత సర్కారు తీసుకుంటున్న చర్యలు కూడా అంతంత మాత్రంగనే ఉంటున్నయి. గ్రామాల్లో జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో రోగులు పీహెచ్‌సీలకు క్యూ కడుతున్నారని పేర్కొన్నారు.
కానీ వందలాదిగా డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల మధ్య పీహెచ్‌సీల్లో వైద్యం సరిగా అందట్లేదు. దీంతో ప్రజలకి మరో దిక్కులేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నరు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆస్పత్రులు అందినకాడికి దండుకుంటున్నయి. ముఖ్యంగా డెంగీ పేరుతో ప్లేట్లెట్స్ తగ్గాయని భయపెడుతూ దోపిడీ చేస్తున్నయి. టెస్టుల పేరుతో వేలకు వేలు గుంజుతున్నయి. ఇంత జరుగుతున్నా కేసీఆర్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఏం కేసీఆర్… ప్రజలు ఇన్ని అవస్థలు పడుతుంటే నీ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇప్పటికైనా మేలుకుని… ప్రజలకు సరైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ కేసీఆర్ సర్కార్‌కి తెలంగాణ ప్రజనీకం కచ్చితంగా బుద్ధి చెబుతుందని ఫైర్ అయ్యారు విజయశాంతి.