సిఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక కేసీఆర్ బెంబేలెత్తిపోతున్నన్నారు అని ఆమె ఆరోపించారు. ఎంఐఎంతో కలసి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను చివరిక్షణంలో పోటీ నుంచి తప్పించే కుట్ర పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎంఐఎం నేతలు మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే దానిని కట్టడి చెయ్యడం లేదు అన్నారు.
ఎంఐఎం దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించడానికి పోలీసు బలగాలను ప్రయోగించడానికి దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారని వార్తలు వస్తున్నాయి అన్నారు. ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హైజాక్ చేస్తూ వస్తున్నారని ఆమె ఆరోపించారు. లేదంటే గెలిచిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్ కి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు ఫలించవని నిర్ణయానికి వచ్చినట్లున్నారనారు. ఏకంగా బలమైన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను శాంతి భద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించడానికి కొత్త ఎత్తుగడ వేస్తున్నారని ప్రచారం జరుగుతోందని ఆమె వెల్లడించారు.