తమిళనాడులోని శివగంగై జిల్లా పొతకుడి అనే గ్రామంలో గ్రామస్థులు వీధి దీపాలు ఉన్నా 35 రోజుల పాటు వాటిని వాడలేదు. ఒక పిచ్చుకను, దాని కుటుంబాన్ని రక్షించడం కోసం వారు అన్ని రోజుల పాటు స్ట్రీట్ లైట్లను ఆన్ చేయడం మానేశారు. గ్రామస్థులు మూకుమ్మడిగా కలిసి ఆ నిర్ణయం తీసుకోవడంతో ఆ పిచ్చుక, దాని పిల్లలు బతికి బట్టకట్టాయి. వివరాల్లోకి వెళితే…
పొతకుడి గ్రామంలో మొత్తం 35 వీధి దీపాలు ఉన్నాయి. వాటన్నింటికీ ఒకే స్విచ్ బోర్డు ఉంది. ఆ గ్రామంలో మొత్తం 100 వరకు కుటుంబాలు ఉంటున్నాయి. అయితే ఆ స్విచ్ బోర్డు వద్ద ఓ పిచ్చుక గుడ్లు పెట్టింది. వాటిని చూసిన గ్రామ యువకుడు ఎ.కరుప్పురాజా తమ గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టాడు. పిచ్చుక స్విచ్ బోర్డు వద్ద గుడ్లను పెట్టిందని, ఎవరూ అటు వైపుకు వెళ్లవద్దని, ఆ స్విచ్ బోర్డును కొద్ది రోజుల పాటు ఉపయోగించవద్దని, వీధి దీపాలను ఆన్ చేయవద్దని.. మెసేజ్ పెట్టాడు.
అలా ఆ యువకుడు పెట్టిన మెసేజ్‌కు ఆ గ్రామస్థులందరూ సరేనన్నారు. ఈ క్రమంలో ఆ గ్రామంలో రాత్రి పూట చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. అయినప్పటికీ వారు 35 రోజుల పాటు వీధి దీపాలను ఆన్ చేయలేదు. చివరకు ఆ పిచ్చుక పెట్టిన గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చాయి. దీంతో వారు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పిచ్చుకను, దాని పిల్లలను ఆ గ్రామస్థులు అలా కాపాడినందుకు సోషల్ మీడియాలో అందరూ వారిని అభినందిస్తున్నారు.