అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బోస్టన్ నగరంలో ఓ రైలులో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ట్రైన్ ముందు భాగంలో మంటలు చెలరేగడంతో సబ్‌వే రైలును మిస్టిక్ నదిపై ఉన్న బ్రిడ్జిపై నిలిపివేశారు. బ్రిడ్జిపై ఒక్కసారిగా రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
బ్రిడ్జిపై రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు కిటికీల నుంచి బయటకు దూకారు. ఓ మహిళ తన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ఆమె ఏకంగా నదిలో దూకింది. ఈ మేరకు సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. రైలులో ప్రయాణిస్తున్న 200 మందిని సురక్షితంగా కాపాడారు.
అయితే రైలులో మంటలు ఎలా చెలరేగాయని విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. రైలుకు ఉన్న మెటర్ ప్యానల్ పట్టాలకు తగలడంతో మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు. బ్రిడ్జిపై రైలు నిలిపివేయడంతో ఆరెంజ్ లైన్ ట్రైన్ సర్వీసులను నిలిపివేసినట్లు మసాచుటెస్ బే ట్రాన్స్ పోర్టేషన్ అధికారులు వెల్లడించారు.