తెల్లవారుజామున ఒక్కసారిగా కలకలం.. ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువుతో వైజాగ్ వాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. ఏం జరుగుతుందో కొంత సేపు అర్థం కాలేదు. చివరకు విష వాయువు అని తెలిసే సరికే చాలా మంది స్ప్రహ కోల్పోయారు. పలువురు చనిపోయారు. అనేక మందికి హాస్పిటళ్లలో చికిత్స అందిస్తున్నారు. కొందరు అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇంకా ఈ దుర్ఘటన వల్ల ఎంత మంది చనిపోతారోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇంతకీ అసలు ఆ ఏమిటి..? దాంతో మనకు ఎలాంటి ప్రాణాంతక పరిస్థితులు, అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి..? అంటే…
వైజాగ్‌లోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడింది స్టిరీన్ (Styrene) వాయువు. ఇది ఒక బెంజీన్ సమ్మేళనం. ఇది ద్రవరూపంలోనూ ఉంటుంది. మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్, రబ్బర్, లేటెక్స్ వంటి పదార్థాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ వాయువు మనకు అత్యంత హానికరం. దీన్ని పీల్చాక 10 నిమిషాల్లోనే కొందరు స్పృహ కోల్పోయేందుకు అవకాశం ఉంటుంది. ఇక 45 నుంచి 60 నిమిషాల్లో ఆక్సిజన్ అందకపోతే కొందరు శ్వాస ఆడక చనిపోతారు కూడా. ఊపిరితిత్తులపై ఈ వాయువు ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఈ గ్యాస్‌ను పీల్చగానే ఎవరికైనా సరే శ్వాస ఆడదు. తరువాత స్పృహ కోల్పోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్తారు.
ఈ గ్యాస్ వల్ల కళ్లు, చర్మం, ముక్కు దురద పెడతాయి. జీర్ణాశయ, శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. దీర్ఘకాలికంగా ఈ వాయువు వల్ల కిడ్నీలు, నాడీ మండల వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అలాగే తలనొప్పి, డిప్రెషన్, అలసట, వినికిడి లోపం ఏర్పడడం, ఏకాగ్రత లోపించం వంటి సమస్యలు వస్తాయి. కొందరికి క్యాన్సర్ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది.