అధికార పార్టీ వైసీపీలో అంతర్మధనం పెరిగింది. ముఖ్యంగా వలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత నేతలకు, ప్రజలకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఇంతకు ముందు ప్రజలకు నేతలే నేరుగా జవాబుదారీగా ఉండేవారు. ఏ కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా వారే నేరుగా ప్రజలతో సంప్రదించేవారు. అదేసమయంలో ప్రజలు కూడా నేరుగా తమసమస్యలను చెప్పుకొనేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీల కార్యాలయాకు క్యూకట్టేవారు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. నేతలు-ప్రజలకు మధ్య గ్యాప్ పెరిగి పోయింది. వీరిమధ్యలోకి వలంటీర్లు వచ్చారు. దీంతో ప్రజలు ఏం కావాలన్నా.. నేరుగా వలంటీర్లకు పోన్లు కొడుతున్నారు.
ఈ పరిస్థితిని నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. తమకు ప్రజలకు మధ్య గ్యాప్ పెరిగితే.. రేపు ఓటు బ్యాంకు విషయంలో తేడా రాదా? అనేది ప్రధాన ప్రశ్న. అంతేకాదు.. ప్రజలకు తమకు బంధం తెగితే.. దీనిని ప్రతిపక్షాలకు చెందిన నాయకులు భర్తీ చేయడం జరుగుతుందని, ఈ విషయంలో వైసీపీ విఫలమవుతుందని వీరి ఆవేదన. అదేసమయంలో మంత్రులకన్నా.. వలంటీర్లు నయమనే వాదన వైసీపీలోనే వినిపిస్తుండడం మరింతగా ఆకర్షిస్తున్న చర్చ! నిజానికి మంత్రులకు-వలంటీర్లకు పోలిక ఏంటి? అనే ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం. అసలు మంత్రుల స్థాయి ఏంటి? వలంటీర్ల పరిస్థితి ఏంటి.. అనుకుంటారు కూడా!
అయితే.,. మంత్రులకన్నా కూడా వలంటీర్లే బెటర్ అని వైసీపీ నేతలు ఘంటా పథంగా చెబుతున్నారు. మంత్రులు కూడా వలంటీర్ల నుంచే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తున్నారనేది వీరి వాదన. ఇటీవల విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన నేతల విషయంలో మంత్రులు అక్కడి సమాచారాన్ని వలంటీర్లను కేంద్రంగా చేసుకుని సేకరించినట్టు వార్తలు వచ్చాయి. కొందరు వలంటీర్లను నేరుగా అతిథి గృహానికి రప్పించుకుని.. వారి నుంచి తమకు అవసరమైన సమాచారం సేకరించినట్టు గుప్పుమంది. అంతా రహస్యంగానే జరిగినా బయటకు పొక్కింది.
దీంతో మంత్రులు నేరుగా సీఎం వద్దకు తీసుకువెళ్లే సమచారం కూడా వలంటీర్ల నుంచే సేకరిస్తున్నారా ? అనే కోణంలో వైసీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. దీంతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలనే సంకేతాలు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈవిషయం పార్టీలో చాలా ఆసక్తిగా మారడం గమనార్హం.