డేటా సైంటిస్టుగా రాణించాల‌నుకుంటున్నారా..? ఇలా చేయండి..!

-

ఐటీ రంగంలో ప్ర‌స్తుతం అనేక విభాగాల్లో అనేక కోర్సులు, ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఆ రంగంలో కెరీర్‌ను ఎంచుకునే వారికి అందులో పుష్క‌లంగా ఉపాధి అవ‌కాశాలు ఉన్నాయి. అయితే అందుకు స‌రైన నైపుణ్యాలను క‌లిగి ఉండ‌డంతోపాటు తాము ఎంచుకునే విభాగానికి చెందిన కోర్సులోనూ నిష్ణాతులు అయి ఉండాలి. అప్పుడే చ‌క్క‌ని ఉద్యోగం సాధించ‌గ‌లుగుతారు. అయితే రానున్న రోజుల్లో ఐటీ రంగంలో డేటా సైంటిస్టు ఉద్యోగాల‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అందుకు గాను ఏయే కోర్సుల‌ను నేర్చుకోవాలి ? ఏయే మెళ‌కువ‌ల‌ను క‌లిగి ఉండాలి ? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గ‌ణితం, స్టాట్స్‌, మెషిన్ లెర్నింగ్‌ల‌పై ప‌ట్టుఉన్న‌వారు డేటా సైంటిస్టులుగా రాణించ‌వ‌చ్చు. ఎంఐటీ ఓసీడ‌బ్ల్యూ, ఓపెన్ ఇంట్రో త‌దిత‌ర ఆన్‌లైన్ సైట్ల‌లో స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌, మెషిన్ లెర్నింగ్‌ల‌ను ఇంకా ఎక్కువ‌గా నేర్చుకోవ‌చ్చు. అలాగే కంప్యూట‌ర్ సైన్స్ లోనూ మెళ‌కువ‌ల‌ను క‌లిగి ఉండాలి. పైథాన్‌, ఎస్ఏఎస్‌, ఎస్‌పీఎస్ఎస్‌ల‌లో ప్ర‌తిభ క‌లిగి ఉండాలి. అందుకు ఆయా కోర్సుల‌ను నేర్చుకోవాలి. అలాగే మై ఎస్‌క్యూఎల్‌, కౌచ్‌డీబీ, పోస్ట్‌గ్రెస్‌, మోంగోడీబీ, కాసాండ్రా కోర్సులను నేర్చుకోవాలి. అందుకు ఆన్‌లైన్‌లో ప‌లు సైట్లు ఉచిత ట్రెయినింగ్‌ను కూడా అందిస్తున్నాయి. మోంగో డీబీ యూనివ‌ర్సిటీ, డేటా మంకీ ప్రొ సైట్ల‌లో ఆయా కోర్సుల‌ను నేర్చుకోవ‌చ్చు.

ఇక డేటా మంగింగ్‌, క్లీనింగ్‌ల‌లోనూ మెళ‌కువ‌ల‌ను క‌లిగి ఉండాలి. జాన్ హాప్‌కిన్స్‌, కోర్స్ ఎరాల‌లో ఈ టూల్స్ గురించి నేర్చుకోవ‌చ్చు. డేటా విజువ‌లైజేష‌న్ కోసం జీజీవిస్‌, డీబీ, వెగా అనే టూల్స్ అందుబాటులో ఉన్నాయి. డేటా రిపోర్టింగ్ నేర్చుకునేందుకు ఆర్ మార్క్ డౌన్‌, స్పాట్ ఫైర్ వంటి టూల్స్ ల‌భిస్తున్నాయి.

డేటా సైంటిస్టుగా రాణించేందుకు బిగ్ డేటాపై అవ‌గాహ‌న ఉండాలి. అందుకు హ‌డూప్‌, మ్యాప్ రెడ్యూస్‌, స్పార్క్ అనే సిస్ట‌మ్స్ ల‌భిస్తున్నాయి. ఆయా టూల్స్‌, కోర్సుల‌ను నేర్చుకున్నాక ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రాజెక్ట్‌లో పాలు పంచుకోవాలి. ఇంట‌ర్న్‌షిప్‌, బూట్‌క్యాంప్‌ల‌లో పార్టిసిపేట్ చేయాలి. ఆ రంగంలో ప‌ట్టున్న వారితో చిన్న చిన్న ప్రాజెక్టులు శాంపిల్‌గా చేయాలి. ఆ దిశ‌గా స్కిల్స్ పెంపొందించుకోవాలి. చివ‌ర‌కు డేటా సైంటిస్టుగా కావ‌ల్సినంత ప్ర‌తిభ‌, నైపుణ్యం వ‌స్తాయి. అయితే ఇందుకు చాలా స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చు. కానీ ఈ రంగంలో ఉన్న ఉపాధి అవ‌కాశాల దృష్ట్యా.. స‌రైన నైపుణ్యాలను నేర్చుకుని, కోర్సుల్లో శిక్ష‌ణ పొందితే.. క‌చ్చితంగా డేటా సైంటిస్టుగా జాబ్ కొట్ట‌వ‌చ్చు. త‌రువాత లైఫే మారిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version